ముస్లింలకే మండలి చైర్మన్
శాసన మండలి చైర్మన్ పదవిని ముస్లిం సోదరులకే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. మక్కా యాత్రకు వెళ్లే యాత్రికులతో కూడిన బస్సులను వెలగపూడి సచివాలయంలో సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హజ్ గైడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మైనారిటీలను రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం మంజూరు చేయడం మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధన్యానికి నిదర్శనమని అన్నారు. కడప, విజయవాడ హజ్ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. హజ్‌యాత్రకు వెళ్లే వారు, హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2810 మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తున్నామని తెలిపారు.













