2న నవ నిర్మాణ దీక్ష
ఈ సారి కూడా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దనే నవనిర్మాణ దీక్ష నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. దీక్షకు సంబంధించిన కార్యచరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదు. ఏ విధంగా వేడుకలు జరుపుకొంటాం? నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదు కదా? తలసరి ఆదాయంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే రూ.32 వేలు వెనుకబడి ఉన్నాం. దీనిని అధిగమించాలంటే మరో ఎనిమిదేళ్లు పడుతుంది అని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కష్టపడి ఫలితాలు సాధించారని అన్నారు. నాలుగేళ్లలో మనం సాధించిన ఈ అభివృద్ధిని ప్రజలకు అంకితం చేద్దామన్నారు. కేంద్రం అండదండలు ఉంటే మరింత పురోగతి సాధ్యమయ్యేదన్నారు.













