పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా
నాది పేదరిక కులం అని, పెదరికం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష 5వ రోజైన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం హైదరాబాద్‌ను నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దామని అన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, విభజన తరువాత కూడా ఏపీలో చిచ్చుపెట్టాలని కొందరూ చూశారని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటామని, వారు కోరుకున్న విద్యను ఉచితంగా అందిస్తామని సృష్టం చేశారు. హేతు బద్ధతలేకుండా రాష్ట్ర విభజన చేశారని నాటి యుపిఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏపీకి న్యాయం చేయాలని అడగలేకపోయారని, ఆనాడే గట్టిగా నిలదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
భవిష్యత్తులో కరెంట్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే కరెంట్ చార్జీలు తగ్గించేందుకు కృషి చేస్తామని సృష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు ఆ లతో అభివృద్ధి లక్ష్యంగా నినాదాలు ఇచ్చామని, ఆ అంటే అమ్మ అని అమ్మకు వందనం పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాజధాని చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డును 182 కిలోమీటర్లతో నిర్మిస్తామన్నారు. రాజధానిలో 9నగరాలు రాబోతున్నాయన్నారు. సింగపూర్ సిటీ లాగా రాజధానిని నిర్మిస్తాన్నానని, సింగపూర్ ప్రభుత్వం కంపెనీతో ఆ పనిచేయించడానికే వారి ముందుకు వచ్చారన్నారు. అగ్రవర్ణ పేదలకు రూ.750 కోట్లు కేటాయించామన్నారు. పేదలు ఏ కులంవారైనా ఎంత వరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రయోగాలు, క్రొత్త ఇన్నోవేషన్స్‌కు అంకురార్పాణ జరుగుతాయని, అక్కడ నిత్యం పరిశోధనలు జరగడమే దీనికి కారణమన్నారు. సిలికాన్ వ్యాలీలో ఎక్కువ తలసరి ఆదాయం గల జాతీయ తెలుగుజాతేనని అన్నారు.













