బాపట్ల జిల్లాలో నాట్స్ మన గ్రామం.. మన బాధ్యత కార్యక్రమం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఆధ్వర్యంలో రూపొందించిన మన గ్రామం.. మన బాధ్యత కార్యక్రమాన్ని తన స్వగ్రామంలో చేపట్టేందుకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ముందుకొచ్చారు. తన సొంత నిధులతో గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే రోడ్లను బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో చెరువు కట్టపై ఉన్న తుమ్మ చెట్లను తొలిగించి ప్రజలు నడవటానికి వీలుగా రోడ్ల వేయిస్తున్నారు. నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) ల సంయుక్త సహకారంతో రాజేంద్ర మాదాల చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు వెళ్లినా కూడా సొంత గ్రామం పై రాజేంద్ర మాదాల మమకారం చూపిస్తున్నారని సొంత నిధులు వెచ్చించి తమకు చెరువు కట్ట రోడ్డును వేయించడం స్థానిక యువతలో కూడ స్ఫూర్తిని నింపుతుందని స్థానిక నాయకులు తెలిపారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన మూలాలు మరిచిపోకూడదని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. సొంత గ్రామానికి నాట్స్ బోర్డ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల చేసిన సాయం నాట్స్‌కు కూడా మంచిపేరు తీసుకువస్తుందని అన్నారు.
అంబడిపూడి గ్రామంతో పాటు, మండలంలోని గుంటుపల్లి, బల్లికురవ, కొత్తపాలెం గ్రామాలలో కూడా నాట్స్ చొరవ తీసుకొని రోడ్లు విస్తరణ, చెట్లు తొలగింపు, చెరువులు బాగుచేయటం వంటి కార్యక్రమాలను చేపడుతుంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన నాట్స్ అధ్యక్షుడు బాపు నూతిని స్థానిక ప్రజలు ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునే ఇలాంటి కార్యక్రమాలు దేశ భక్తిని పెంచుతాయని.. ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ తాము పుట్టిన గ్రామానికి చేతనైన సాయం చేయాలనే స్ఫూర్తిని నింపుతాయని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంబడిపూడి గ్రామంలో అభివృద్ధికి ముందుకొచ్చిన నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.







