నన్నయ్య వర్సిటీకి అరుదైన గౌరవం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి చెందిన జాతీయ సేవాపథకం(ఎన్ఎస్ఎస్) విభాగం అరుదైన గౌరవం దక్కించుకుంది. జాతీయస్థాయిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ ఇందిరాగాంధీ పురస్కారానికి, తమ వర్సిటీలోని సంబంధిత విభాగం ఎంపికైనట్లు కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు అందాయని నన్నయ్య ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు పేర్కొన్నారు. ఈ నెల 25న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయన్నారు. దక్షిణాదిలో నన్నయ విశ్వవిద్యాలయం మాత్రమే ఈ గౌరవం దక్కించుకుందన్నారు.













