ఏపీకి మరో అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వయం సహాయక డ్వాక్రా సంఘాలు రాష్ట్రానికి రెండు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిపెట్టాయి. అనంతపురం జిల్లా, బుక్కరాయ సముద్రం మండలం వడియంపేట గ్రామానికి చెందిన మహా లక్ష్మిస్వయం సహాయక సంఘం, కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూర్కు చెందిన యారాబ్ స్వయం సహాయక సంఘం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలక నారాయణపురానికి చెందిన శ్రీమహాలక్ష్మి స్వయం సహాయక సంఘాలు ఉత్తమ ప్రతిభ కనబరినందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.
2017-18 సంవత్సరానికిగానూ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కేటగిరీ కింద దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధుల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృందాలను వారి ప్రతిభవ ఆధారంగా ఎంపిక చేసి ఈ పురస్కారాలను అందజేస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల కింద వడియం పేట, నన్నూర్, అలక నారాయణపురంనకు చెందిన గ్రూపులకు రూ.లక్ష చెక్కును, ప్రశంసాపత్రాన్ని తోమర్ అందజేశారు. ఢిల్లీలో అవార్డులందు కోవడం సంతోషంగా ఉందని డ్వాకా మహిళలు తెలిపారు.













