Narayana Swamy: ఇదంతా కక్ష సాధింపు మాత్రమే..లిక్కర్ స్కాం పై నారాయణ స్వామి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మద్యం స్కాం కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) పేరు వినిపించడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సిట్ (SIT) అధికారులు ఆయనను ప్రశ్నించడం, అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నారాయణ స్వామి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
తిరుపతి (Tirupati) లో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. “నాకే లేని ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నామని ఎలా చెబుతారు?” అని ప్రశ్నించారు. తనను విచారణ చేసిన తర్వాత “బ్రహ్మాండం బద్దలైంది” అన్నట్టుగా ప్రచారం చేయడం వాస్తవానికి దూరమని అన్నారు. తాను పనిచేసిన కాలంలో మద్యం విధానం పూర్తిగా పారదర్శకంగానే అమలైందని చెప్పారు. ఈ కేసు అసలు నిజం కాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం మాత్రమే ఈ స్కాం సృష్టించారని ఆరోపించారు.
తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసి ఉంటే విషం తాగి చనిపోతానని నారాయణ స్వామి బహిరంగంగా సవాలు విసిరారు. మద్యం విధానంలో తప్పు జరిగిందని ఎవరు చెప్పగలరని ఆయన ప్రశ్నించారు. తాను దళిత, బలహీన వర్గానికి చెందిన నాయకుడినని, తన వ్యక్తిత్వాన్ని చెడగొట్టేలా తప్పుడు కథనాలు సృష్టించారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఈ స్కాంలో జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పేరు అనవసరంగా లాగడం సరికాదని అన్నారు. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, తనకు ఏ పని చేయమని సూచించలేదని స్పష్టం చేశారు. జగన్ తనను ఈ వ్యవహారంలో నడిపించారన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉండటంతోనే గత ఎన్నికల్లో పోటీకి దూరమయ్యానని చెప్పారు. తన స్థానంలో కుమార్తె కృపాలక్ష్మి (Krupal Lakshmi)కి అవకాశం ఇవ్వాలని కోరగా, జగన్ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సిట్ అధికారులు విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వాదించారు.
తన ఇంట్లో కోట్లు దొరికాయని ప్రచారం జరుగుతుండటం పట్ల నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లో సిట్ బృందం డబ్బు లెక్కించిందన్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారమని అన్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఐదేళ్లు పనిచేసిన తాను ఎలాంటి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదని, అన్ని నిర్ణయాలు ఉన్నత స్థాయి నుంచి వచ్చేవని స్పష్టం చేశారు.మొత్తానికి, నారాయణ స్వామి తనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. మద్యం స్కాం అనేది కేవలం రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు సృష్టించబడిన కధనమేనని ఆయన వాదన. కానీ ఈ కేసు విచారణ ఏ దిశగా వెళ్తుంది అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.







