అవయవదానంలో గిన్నీస్ రికార్డు
భారీ ఎత్తున అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్ రికార్డు సృష్టించారు. నరసరావుపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా సమాజహితం కోరి ఆవయవదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో అవయవదాన అంగీకార పత్రంపై గంట వ్యవధిలో ప్రజలు తమ అంగీకారం తెలియజేస్తూ సంతకాలు చేశారు. కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్ ప్రతినిధి డాక్టర్ స్వప్నయ్ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో 200 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన నరసరావుపేట తొలిసారిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. ఉదయం 9:30 గంటలకే అవయవదానం చేయడానికి వచ్చిన వారితో స్టేడియంలో ఏర్పాపు చేసిన స్టాళ్లు కిక్కిరిశాయి. గంట వ్యవధిలోనే రికార్డు సాధించారు. ఉదయం 10:47 గంటలకు కోడెల సంతకాలు చేసేందుకు బెల్ నొక్కారు. తొలి సంతకం ఆయనే చేశారు. 11.27 గంటలకు 10,500 మంది సంతకాలు చేశారు. గంట వ్యవధి పూర్తయ్యే సరికి 11,987 మంది అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారని గిన్నీస్‌బుక్ ప్రతినిధి డాక్టర్ స్వప్నయ్ ప్రకటించారు.













