పాదయాత్ర అడ్డుకుంటే.. వైసీపీకి అంతిమ యాత్ర
పేద ప్రజలంటే సీఎం జగన్‌కు చాలా చులకన అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. వినుకొండలో పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు. పోలీసులకు పంపిస్తే తగ్గేదేలే అని చెప్పా. మైకు లాక్కోవాలని చూశారు. ఎన్టీఆర్ వారసుని గొంతు నొక్కటం సాధ్యమా? బాంబులకే భయపడని కుటుంబం మాది. యువగళం కొనసాగిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్ర. జగన్ ఇసుకను పందికొక్కులా తింటున్నారు. ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా ఇసుక తవ్వకాల ద్వారా దోపిడి చేస్తున్నారు. ఇసుక మాఫియాలో స్వర్ణముఖి నదిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు. వంద సంక్షేమ పథకాలను కట్ చేసిన ఘనత ఈ సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు.
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాదు, కబ్జాల నాయుడు. మేం చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కబ్జాబరాయుడిని ఓడిరచకపోతే వినుకొండలో ఏమీ మిగలదు. వినుకొండ అభివృద్ధికి జగన్ అనేక హామీలిచ్చారు కానీ నెరవేర్చలేదు. ఇక్కడి ప్రజలకు తాగునీరు అందించే బాద్యతను టీడీపీ తీసుకుంటుంది. వినుకొండ పురపాలికలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. వినుకొండ కబ్జారాయుడిపై సిట్‌తో విచారణ జరిపించి, కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకుంటాం అని స్పష్టం చేశారు.













