యువగళం పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. శ్రీశైలం నియోజవకర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో యువగళం పాదయాత్ర జాతరను తలపిస్తోంది. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.













