చంద్రబాబు అరెస్ట్.. భావోద్వేగానికి లోనైన నారా లోకేశ్..!
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. కొంతమంది నేతలు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక చంద్రబాబు కుటుంబసభ్యులు పూర్తిగా డీలా పడిపోయారు. తనయుడు నారా లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఒక లేఖ రాశారు.. ఇక భార్య భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.
చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి. పైగా ఆయన వయసు 74 ఏళ్లు. బీపీ, షుగర్ తో బాధయపడుతున్నారు. ఈ వయసులో ఆయన జైలుకు వెళ్లాల్సి రావడాన్ని టీడీపీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. చేయని నేరానికి జగన్ ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి జైలుకు పంపించిందని ఆరోపిస్తున్నాయి. కుటుంబసభ్యులైతే చంద్రబాబును ఇలా చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. లోకేశ్, భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణి, సుహాసిని లాంటి వాళ్లు మీడియా ముఖంగానే భావోద్వేగాలకు లోనయ్యారు.
తన తండ్రి చంద్రబాబు ఏ తప్పూ చేయకపోయినా ఆయన్ను జైలుకు పంపారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నడూ చేయానికి నేరానికి అన్యాయంగా రిమాండ్ చేశారని .. తన కోపం కట్టలు తెంచుకుంటోందని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రం కోసం, తెలుగు ప్రజలకు సేవ చేయడం తప్ప ఆయన ఎన్నడూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. ఇంతటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు. అందరికంటే ముందే అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించినందుకేనా.. అని నిలదీశారు.
“ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతికోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగా.. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి అనేది తెలీదు. ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాగా, నిజాయితీగా ఉంటాయి. సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞుతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశా.. వాళ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి. అవి పిల్లల ఆనందానికి సమానమైనవి. నేనూ ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకుని భారత్ కు తిరిగొచ్చా.. ఇది కఠినమైన నిర్ణయమైనా.. నాకు మన దేశం, వ్యవస్థలు, అన్నిటికీ మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది..” అని లోకేశ్ రాసుకొచ్చారు.













