టీడీపీ గెలిపిస్తే నంద్యాల మరింత అభివృద్ధి : లోకేష్
రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పర్యటించారు. కానాల, జూలేపల్లి, పసురుపాడు, గోస్పాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరంలో కట్టబట్టలతో బయటకు గెంటేశారని అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.25వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. 2019లోగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. భూమా అఖిలప్రియను ఆశీర్వదించి ఆమె నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.













