రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే.. ఆ తర్వాత బ్రేక్
రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే, ఆ తర్వాత బ్రేక్ తీసుకోవాల్సిందేనని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ మహానాడులో లోకేశ్ మాట్లాడుతూ టీడీపీలో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వమని తెలిపారు. పార్టీ పదవుల్లో ఇకపై 2G1 సిద్దాంతం అమలుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని తెలిపారు. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. ఇది తన బలమైన కోరిక అని ఇదే విషయంపై పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించానని వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులను నియమించాల్సి ఉంది. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టతతో ఉన్నారు. మహానాడు తర్వాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెడతాను అని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు. పని చేయని నేతలకు, ఇన్చార్జ్లకు అవకాశాలుండవని లోకేశ్ తేల్చి చెప్పారు.













