క్రియేటివిటీ సెంటర్ గా అమరావతి
రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో సృజనాత్మక కేంద్రం (క్రియేటివిటీ సెంటర్)గా రూపొందాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్సర్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్-ఇంపాక్టింగ్ ది ప్యూచరిస్టిక్ స్కిల్స్ (ఐసీటీఐఈఈ, ఏపీ-2018) సదస్సుకు మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇప్పటికే 12 శాతం వృద్ధి రేటుతో ఏపీ ముందుకెళ్తోందని లోకేశ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఏడాది క్రితం ఎస్ఆర్ఎం వర్సిటీ అమరావతికి వచ్చిందన్నారు. ఏడాది కాలంలోనే అత్యాధునిక సదుపాయాలతో క్లాసులు మొదలయ్యాయని ప్రశంసించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని పరిధిలోని 7 ప్రధాన రహదారులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఎస్ఆర్ఎం వర్సిటీ వ్యవస్థాపక చాన్సలర్ డాక్టర్ టి.ఆర్. పారివేందర్ తదితరులు పాల్గొన్నారు.













