ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు
భారతదేశం వినియోగిస్తున్న 480 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో 240 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే తయారుకావాలన్నది తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ లక్ష్యం సాధించేందుకు సన్‌రైజ్ స్టేట్ ఏపీకి చైనాలో ఉన్న ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. చైనా పర్యటనకు వెళ్లిన లోకేశ్ బీజింగ్‌లో చైనా తెలుగు అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారంతా ఒక్కటేన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసి ఉండి రెండు రాష్ట్రాల అభివృద్ధికి పనిచేయడం ఒక్క తెలుగువారికే సాధ్యమైందన్నారు. చైనాలోని ప్రవాస తెలుగువారు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరుగుతున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పి పెట్టుబడులను తెచ్చే బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు వ్యవహరించాలన్నారు.













