Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోతున్నారంటూ కార్మికులు మూడేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇందుకు పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కూటమి పార్టీలు చెప్తున్నాయి. అయినా ఎవరూ నమ్మట్లేదు. ఇదే అంశంపై ఇవాళ శాసన మండలిలో మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ప్లాంట్ ను కాపాడే బాధ్యత తమకుందని తేల్చి చెప్పారు.
శాసనమండలిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడింది టీడీపీ, బీజేపీయేనని.. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చి రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపామని వివరించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 48 శాతం మాత్రమే స్టీల్ ప్లాంట్ పనులు జరిగేవని.. ఇప్పుడు 80 శాతం మేర పనులు జరుగుతున్నాయని లోకేశ్ వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుబ్రమణ్య స్వామికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని కోరారు.
అయితే.. ప్రభుత్వ వాదనను వైసీపీ తప్పుబట్టింది. ప్రవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. 32 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారని చెప్పారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణ ఉండబోదని కూటమి చెప్పిందని, ఇప్పుడు కూడా దానిపై కూటమి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన 11వేల 400 కోట్లలో ఒక్క రూపాయి కూడా ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదన్నారు.
అయితే వైసీపీ ఆరోపణలను మంత్రి లోకేశ్ తిప్పికొట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మా మూడు పార్టీలు హామీ ఇచ్చాయని, దానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. గత ఐదేళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ పదేపదే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా దీనిపై మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందంటూ కావాలని వివాదం రేకెత్తిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరడం వల్లే కేంద్రం నిధులిచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
అనంతరం.. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలంటూ వైసీపీ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే వైసీపీ తీర్మానాన్ని మంత్రి లోకేశ్ తప్పుబట్టారు. ప్రైవేటీకరణ జరగదని మేం చెప్తుంటే పరిరక్షించాలని విపక్ష నేత తీర్మానం పెట్టడం సమంజసం కాదన్నారు. అయితే తమ తీర్మానంపై డివిజన్ పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. దీంతో రెండు తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్నట్టు మండలి ఛైర్మన్ వివరించారు. మొత్తానికి మండలిలో ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వాడివేడి చర్చ జరిగింది.