Nara Lokesh: సింగపూర్‌లో లోకేష్ పర్యటన సక్సెస్

35 కార్యక్రమాలు… అధికారులతో భేటీలు, రోడ్ షోలు, కంపెనీల సందర్శన
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సింగపూర్ (Singapore) పర్యటించిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించారు. సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జీ టు జీ (గవర్నమెంటు టు గవర్నమెంట్) సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 సైట్ విజిట్లు, రోడ్ షో/డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేశ్ హాజరయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో ఎయిర్ బస్, ఎవర్ వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రో సాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవీపీ సెమి, క్యాపిటా ల్యాండ్, ఎబీమ్ కన్సల్టింగ్, డీటీడీఎస్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ ఫలవంతమైన చర్చలు జరిపారు. ఏపీలో పరిశ్రమల స్థాపను నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, అందజేస్తున్న ప్రోత్సాహాకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి.
ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు: లోకేష్
ఎపి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడుదామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఎపిఎన్‌ఆర్‌టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు రాష్ట్రాభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐ లంతా భాగస్వాములు కావాలని కోరారు. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచే అధికశాతం ఉంటాయి. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, ఇండోనేషియా, జకార్తా బాలిలో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం. ఎపిఎన్‌ఆర్‌టి ద్వారా మీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి మేము పనిచేస్తున్నాం.
ఎపిలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్ యుఎస్ ఇంక్ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఎపి ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఎపి ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణా కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతి కత, నైపుణ్యాలను అందించనుండగా, టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఎస్‌టి టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ రీతూ మెహ్లావత్‌తో లోకేష్ భేటీ
ఎస్ టి టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ రీతూ మెహ్లావత్‌తో మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ఎస్ టి టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డాటా సెంటర్ ఏర్పాటుచేయాలని కోరారు. అత్యాధునిక డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఆప్టిమైజేషన్ ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కూడా మంత్రి లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన లను సంస్థ ఉన్నతస్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి, నిర్ణయం తీసుకుంటామని రీతూ మెహ్లావత్ తెలిపారు.
ఎయిర్ బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో లోకేష్ చర్చలు
ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో మంత్రి నారా లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలో ఎయిర్‌బస్‌కు డెడికేటెడ్ ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపైర్, ఓవర్ హాల్) హబ్‌గా మారే అవకాశముంది. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పని చేయాల్సిందిగా కోరాను. రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు ఏపీని సందర్శించా ల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది.
ఐవిపి సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో చర్చలు
సింగపూర్: ఐవిపి సెమి ఫౌండర్ రాజా మాణిక్కంతో నారా లోకేష్ సింగపూర్ షాంగ్రీలా హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఐవిపి సెమీ పర్యావరణ వ్యవస్థ-నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఇలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం తెలిపారు.
డిటిడిఎస్ సిఇఓ చక్రవర్తితో భేటీ
డిటిడిఎస్ గ్రూప్ సిఇఓ బిఎస్ చక్రవర్తితో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డిటిడిఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఇలకు సహకరిం చాలని విజ్ఞప్తిచేశారు.