బడ్జెట్ లో అన్ని వర్గాలను మోసం చేశారు : లోకేష్
వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోసపు రెడ్డి అని ప్రజలు అంటున్నారన్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షమే పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం మోసగించడమేనని మండిపడ్డారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారని దుయ్యబట్టారు. అమ్మ ఒడి అబద్ద్ధం, నాన్న బుడ్డి నిజం, వాహన మిత్ర అబద్ధం, డ్రైవర్లను మోసం చేయడం నిజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని ధ్వజమెత్తారు. హాజరు శాతం పేరుతో అమ్మబడిలో భారీ కోత పెట్టారని విమర్శించారు. మధ్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత రంగం, ఇలా అన్ని వర్గాలను సీఎం మోసం చేశారన్నారు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ.1,850 పెన్షన్ ఇస్తే తండ్రి, కొడుకులు కలిసి ఇచ్చింది రూ.625 మాత్రమేనని తెలిపారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని ఆరోపించారు.













