ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని… వెనక్కి తీసుకోవాలి
సీఎం జగన్కు పేర్ల మార్పు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మహానీయులను అవమానించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని, నేడు విజయనగరంలో ఉన్న మహారాజా జిల్లా ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. మహారాజా కుటుంబం విజయనగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆస్పత్రి కోసం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆ ఆస్పత్రిని అన్ని వసతులతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాత్రికి రాత్రే ఆస్పత్రికి మహారాజా పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.













