టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ : లోకేశ్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని, ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్, గంజాయి పుల్ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్లో చేసుకున్నట్లు చూపించారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో జరిగింది గ్లోబ్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ పానలలో పీపీఏలు రద్దు చేయడంతో పాటు రాష్ట్రం నుంచి పరిమ్రలను తరిమేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక బాగుపడింది భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమేనని ఆరోపించారు.
టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని, వైసీపీ గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్కు ఉందా? అని లోకేశ్ సవాల్ విసిరారు. టీడీపీకి గతంలో ఏమాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని, మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని జగన్కు ఛాలెంజ్ విసిరితే ఆయన స్వీకరించలేదని చెప్పారు.













