అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనను అడ్డుకోవడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా తమ అధినేత రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడన్నారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని సీఎం, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గతంలో గేటుకి తాళ్ళు కట్టారని, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని విమర్శించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డూ, అదుపూ లేదంటూ ట్వీట్ చేశారు.













