ఏపీలో విసృతంగా డ్రోన్ల వినియోగం
దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా డ్రోన్స్ ఎక్సలెన్స్ సెంటర్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఏర్పాటు చేసే విధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్ణయం తీసుకుంది. చైనాలోని వరల్డ్ ఎకనామిక్ న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశం మొదటి రోజు మంత్రి లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రాజెక్టు లీడ్ జయంత్ నారాయణ్‌తో భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్లను పెద్ద ఎత్తున వివిధ పెద్ద ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నామని, అదేవిధంగా గ్రామాల్లో రోడ్ల నాణ్యత తెలుసుకోవడానికి డ్రోన్లకు లైడార్ టెక్నాలజీ జోడించి వినియోగించబోతున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నామని, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించి ల్యాండ్ రికార్డులకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ఐఓటీ పరికరాలు వినియోగించి రియల్ టైం లో సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన జయంత్ నారాయణ్ దేశంలో ఇతర రాష్ట్రాలకంటే మీరు ముందు ఉన్నారని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్ చైన్ వినియోగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు.













