Nara Lokesh: హైదరాబాద్‌కు 30 ఏళ్లు.. విశాఖలో పదేళ్లలోనే : లోకేశ్

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ (Visakhapatnam) ను తీర్చిదిద్దుతామని, 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖ మారుతుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఒక రాష్ట్రం-ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్‌కు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం రుషికొండలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. 1990ల్లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబు సైబర్ టవర్స్ (Cyber Towers) నిర్మించారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి దాదాపు 30 ఏళ్లుగా సమయం పట్టింది. విశాఖలో అభివృద్ధికి పదేళ్ల కంటే ఎక్కువ పట్టదు. రాష్ట్రంలో పెట్టుబడులు రాత్రికి రాత్ర రాలేదు. దాని వెనుక ఉన్న శ్రమను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. సిఫీ చైర్మన్ వేగేశ్న ఆనంద కోటిరాజును తొలిసారిగా 2017లో కాలిఫోర్నియాలో కలిశాను.ఆయన్ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు నాకు ఎనిమిదేళ్లు పట్టింది. ఈ ప్రాజెక్టు విశాఖకు రావడంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కీలకపాత్ర పోషించారు.