మంగళగిరిని మరో సైబరాబాద్ చేస్తాం : లోకేశ్
మంగళగిరి కూడా భవిష్యత్ లో సైబరాబాద్ లా అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పైకేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు, కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. విశాఖతో సమానంగా అమరావతిని ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా చేస్తామని అన్నారు. సైబరాబాద్‌కు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తాయా? అని అందరూ ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ప్రపంచం చూస్తోందన్నారు. మంగళగిరి కూడా భవిష్యత్‌లో అదేవిధంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. మంగళగిరిలో ఐటీ పార్కుకు ఇప్పటివరకు రూ.220 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లో మంగళగిరి ఐటీ క్లస్టర్ లో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.













