లోకేష్ లో మార్పు ఇప్పుడెంతో మారిపోయారు
నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారారు. తనపై వస్తున్న విమర్శలకు లోకేష్ చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్…. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ అయినా దొరుకుతుందేమో కాని చినబాబు మాత్రం చిక్కడన్నది టీడీపీ వర్గాల నుంచే ఎక్కువగా విమర్శ విన్పిస్తోంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా లోకేష్ సమయం కేటాయించని పరిస్థితి. ఇక సీనియర్లను లెక్క చేయరని, వారు ఒకవేళ సలహాలిచ్చినా స్వీకరించే పరిస్థితి లేదని లోకేష్ మీద తీవ్ర ఆరోపణలు విన్పించేవి. ఈ విషయం లోకేష్ కు అత్యంత సన్నిహితులు చెప్పినా విన్పించుకోలేదు. కాని ఈ మధ్య లోకేష్ వ్యవహార శైలిలో పూర్తి మార్పు కన్పిస్తోందటున్నారు తెలుగు తమ్ముళ్లు. అమరవాతిలోని సచివాలయంలో లోకేష్ ఛాంబర్ ఇప్పుడు సందర్శకులతో కళకళలాడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కంటే లోకేష్ పేషీ ఫుల్లుగా కిక్కిరిసిపోయి ఉండటం కన్పిస్తోంది. ఇటు మంత్రిత్వ బాధ్యతలను చూస్తూ తన శాఖ సమస్యలతో వచ్చే సందర్శకులతో పాటు పార్టీ విషయాలను చర్చించడానికి వచ్చే తెలుగు తమ్ముళ్లను కూడా కలుసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో లోకేష్ సందర్శకులను కలుస్తున్నారు.
సీనియర్లుకూడా విస్తుపోయేలా….
లోకేష్ దృష్టికి వచ్చే వినతుల పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. లోకేష్ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత సుమారు 4,624 వినతులు ఆయనకు చేరాయి. ఇందులో 1780 సమస్యలను వెంటనే పరిష్కరించగలిగారు. మరో 750 సమస్యలు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలినవి మిగిలిన శాఖకు చెందినవి. చంద్రబాబు తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేష్ కీలకం కావడంతో అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అయితే ఇతర మంత్రులు చిన్నబుచ్చుకోకుండా లోకేష్ టీం ఆ వినతులను సంబంధిత మంత్రిత్వ శాఖ వద్దకే పంపుతుంది. లోకేష్ వద్దకు వచ్చిన ఇతర శాఖల సమస్య పరిష్కారంపై కూడా ఆయన టీమ్ ఫాలో అప్ చేస్తుండటంతో… చినబాబుకు చెబితే పని అయిపోతుందన్న భావన పార్టీ శ్రేణుల్లోనూ, సందర్శకుల్లోనూ వ్యక్తమవుతోంది. ఇతర మంత్రులపై పెత్తనం చేస్తున్నారన్న అపప్రథ రాకుండా లోకేష్ వాటిని సంబంధిత మంత్రుల వద్దకే పంపుతుండటంతో..వారు కూడా వెంటనే స్పందింస్తున్నారట. మొత్తం మీద లోకేష్ లో ఇంత మార్పు రావడానికి కారణమేంటని పార్టీ సీనియర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.













