Lokesh: మా పవన్ అన్న గ్లాసు! లోకేశ్ మాటల వెనుక అసలు అర్థమేంటి?
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళగిరిలో (Mangalagiri) స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (Swarnandhra swachandhra) కార్యక్రమంలో భాగంగా లోకేశ్ పర్యటించిన సమయంలో జరిగిన ఈ సంఘటనపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Constituency) పారిశుధ్య కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న లోకేశ్, అక్కడి పారిశుధ్య సిబ్బందితో మమేకమయ్యారు. ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతూ అక్కడి కార్మికులతో మాట్లాడారు. ఈ సమయంలో ఓ కార్మికురాలు హ్యాండిల్ ఉన్న గ్లాసులో టీ ఇచ్చింది. దాన్ని గమనించిన లోకేశ్, “మా పవన్ అన్న గ్లాసు ఉండాలి కదా?” అంటూ నవ్వుతూ అన్నారు. జనసేన గుర్తు గాజు గ్లాసు అయినందున, హ్యాండిల్ లేని గ్లాసులో టీ ఇవ్వాల్సిందని సరదాగా కామెంట్ చేశారు. ఈ మాటలు అక్కడి వారిని కాసేపు నవ్వించాయి.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విపరీతంగా చర్చనీయాంశంగా మారాయి. జనసేన గుర్తును ప్రస్తావించడం వెనుక లోకేశ్ ఉద్దేశం ఏమిటనే విషయంపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పిఠాపురంలో జరిగిన జనసేన సభలో నాగబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, టీడీపీ వర్గాలు వాటిపై ఘాటుగా స్పందించాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ-జనసేన మధ్య స్నేహపూర్వక బంధాన్ని చాటేందుకు లోకేశ్ ఈ సరదా వ్యాఖ్య చేశారని అంటున్నారు.
పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన లోకేశ్, పరిశుభ్రతకు సంబంధించి వారి అభిప్రాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధం, మురుగు కాలువల శుద్ధి, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. కార్మికుల జీతాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి, లోకేశ్ చేసిన చిన్న కామెంట్ పెద్ద చర్చకు దారితీసింది. ఇది సరదా మాటగా ఉన్నా, రాజకీయంగా అనేక అర్థాలు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య మైత్రిని చూపించేందుకు ఆయన కావాలనే గాజు గ్లాసును ప్రస్తావించారని కొందరు అంటుంటే, నాగబాబు కామెంట్స్ కి లోకేష్ ఇలా స్పందించారు అని మరికొందరు భావిస్తున్నారు . ఇలా మొత్తానికి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.













