తేడా వస్తే అంతే..
యువగళం పాదయాత్రతో ప్రజల్లో మమేకమవుతున్న నారాలోకేశ్… ఇటీవల తరచుగా నియోజక వర్గ ఇన్ చార్జులకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పనిచేయకుంటే ఇంచార్జులను మార్చేస్తాం.. ఇంచార్జులను తీసేస్తాం అంటూ నేరుగా వార్నింగులు ఇస్తున్నారు. దీనివెనక కూడా ఓప్రత్యేక కార్యాచరణ చేపట్టిన లోకేష్ టీమ్.. ఇంచార్జులపై పనితీరుపై రహస్యసర్వే నిర్వహిస్తోంది. దీంతో ఇంచార్జుల్లో టెన్షన్ మొదలైంది.
మొన్నటివరకూ ఇంచార్జులంటే ఏముంది.. పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఎలా అమలు జరుగుతోంది అన్న అంశంపై ఓ లుక్కేసి.. వాటికి సంబంధించిన నివేదికను అధిష్టానానికి పంపిస్తే సరి.. చాలా మంది ఇంచార్జులు.. ఏసీ గదుల్లో ఉండి నివేదికలు పంపేసి చేతులు దులుపుకోవడం సాదారణంగా జరుగుతూ వస్తోంది. అయితే పార్టీ ఓటమికి ఇంచార్జుల్లో అసమర్థత, నిర్లిప్తత కారణంగా భావిస్తున్న లోకేష్.. వారిపై ఫోకస్ పెట్టారు.
ప్రజలతో ఇన్చార్జిలు మమేకమౌతున్నారా..?పార్టీ సూచించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా..?అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ఎలా స్పందిస్తున్నారు..?క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తున్నారు..?ప్రాధాన్య అంశాలపై ప్రశ్నావళితో సర్వే బృందం ప్రజల్లోకి వెళుతోంది .మరీ ముఖ్యంగా యువగళానికి ముందు, తర్వాతి పరిణామాలను పరిగణలోకి తీసుకుంటోంది. ఇంచార్జుల పనితీరు సరిగ్గా లేని చోట కొత్తవారిని తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆయా నియోజకవర్గాల్లో కులాల సమీకరణను పరిగణలోకి తీసుకుని, ఆయా సామాజికవర్గాల్లో బలమైన వ్యక్తులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయాల్లో లేని వ్యక్తుల బలాబలాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసేవిధంగా సర్వే నివేదికలు రూపొందించే పనిలో సర్వే బృందం నిమగ్నమైంది. అతి త్వరలో సర్వే నివేదికలను నారా లోకేశ్‌కు సమర్పించననున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు ఎదురుకావడం… చాలా మంది ఇంచార్జుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది ఎక్కడ నుంచి ఎక్కడకు పోయి తమ టికెట్ కు ఎసరు తెస్తుందో అన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. దీంతో చాలా మంది ఇంచార్జులు.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? తమకు వ్యతిరేకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్ ను సైతం తమవైపు తిప్పుకుని.. ఈ ఉపద్రవం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.













