నా యాత్రతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది: నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ‘యువగళం’ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో తాడేపల్లిలోని ప్యాలెస్ వణికిపోతోందని లోకేశ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ‘దమ్ము, ధైర్యంతో ప్రజల మధ్య నేను నడుస్తున్నా. నేను ఎవరికీ భయపడే మనిషిని కాదు. వివేకా హత్య కేసులో కనుక సీబీఐ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే.. అరెస్టుల లింకులన్నీ వచ్చి తాడేపల్లి కొంపకు దారి చూపిస్తాయి. జగనాసుర రక్త చరిత్రే అది. జగన్కు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. పేదలపై జగన్ రెడ్డి కక్ష సాధింపు వైఖరి చూపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తాం. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్లకు ఇళ్లు కట్టిస్తాం. రంగాపురం ఎన్టీఆర్ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాం’ అని లోకేశ్ హామీ ఇచ్చారు. తనను అవమానించడానికి మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. పోలీసులను పరదాలా అడ్డుపెట్టుకుని, జగన్ తన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.













