జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలి: లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మనుమడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, డెవలప్మెంట్లో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి వచ్చే వారిలో ఉండాల్సిన మొదటి లక్షణం మంచి మనసు అని, అది పవన్ కల్యాణ్‌లో 2014లోనే కనిపించిందని చెప్పారు. పాదయాత్రలో ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న లోకేశ్.. ప్రభుత్వ అసమర్థత వల్లనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. ఈ కారణంగానే నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని, వాటిని కచ్చితంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు.













