ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే… వారిని వదిలిపెట్టేది లేదు
ఆంధ్రప్రదేశ్లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. ఇటీవల వైసీపీ నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను ములాఖత్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పోలీసులు వైసీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నా క్యాంటీన్లు మూసేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు మూసివేశారని తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. పేదలకు భోజనం లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రారంభిస్తే 60 మంది టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు పర్యటనలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ధ్వంసం చేశారని మండిపడ్డారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఎవరైనా ధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించారు.













