Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మనవడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కుమారుడు నారా దేవాన్ష్ (Nara Devansh) ప్రపంచస్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం పది సంవత్సరాల వయసులోనే చదరంగంలో తన అసాధారణ ప్రతిభను చూపి ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్గా పేరు సంపాదించాడు. లండన్ (London) లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ హాల్ (Westminster Hall) లో జరిగిన వేడుకలో దేవాన్ష్‌కు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)’ నుంచి పురస్కారం అందజేయడం విశేషం. ఈ వేడుకకు హాజరైన నారా లోకేశ్ తన కుమారుడి విజయాన్ని చూసి గర్వంగా నిలిచారు.
గత సంవత్సరం నిర్వహించిన చెక్ మేట్ మారథాన్ (Checkmate Marathon) పోటీలో దేవాన్ష్ ఈ అపూర్వ ఘనతను సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్‌మాస్టర్ లాస్లో పోల్గార్ (Laszlo Polgar) రాసిన 5334 ప్రాబ్లమ్స్ ,కాంబినేషన్స్ అండ్ గేమ్స్(5334 Problems, Combinations, and Games) పుస్తకం నుంచి ఎంపిక చేసిన 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తక్కువ సమయంలో ఇంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా తన మేధస్సు, దృష్టి కేంద్రీకరణ, పట్టుదల ప్రపంచానికి తెలియజేశాడు.
ఈ విజయంతో ఉప్పొంగిపోయిన తండ్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు. వెస్ట్‌మినిస్టర్ హాల్ వేదికగా తన కుమారుడు అంతర్జాతీయ పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. “దేవాన్ష్ పదేళ్ల వయసులోనే ముందు చూపుతో ఆలోచించడం, ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం, ఆటపై అంకితభావం చూపించడం అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అతను రాత్రింబవళ్ళు చేసిన కృషి, సాధనకు న్యాయం చేసే గుర్తింపు ఇది. మా కుటుంబమంతా ఈ క్షణంలో అపారమైన గర్వాన్ని అనుభవిస్తోంది” అని అన్నారు.
ఇదే దేవాన్ష్ సాధించిన మొదటి రికార్డు కాదు. అంతకుముందు కూడా అతని ప్రతిభ ప్రపంచ రికార్డుల రూపంలో వెలుగుచూసింది. ఏడుగుండా ఉన్న ‘టవర్ ఆఫ్ హనోయి (Tower of Hanoi)’ పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తొమ్మిది చెస్ బోర్డులపై 32 పావులను కేవలం ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా అమర్చడం ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.
చిన్న వయసులోనే ఇంత ప్రతిభ కనబరచడం పట్ల క్రీడా రంగం, రాజకీయ వర్గాలు, విద్యావేత్తలు, ప్రజలు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. దేవాన్ష్ చదరంగంలో సాధించిన ఈ విజయాలు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమయ్యాయి. ఇంత చిన్న వయసులోనే తన ప్రతిభతో ప్రపంచానికి తన స్థానాన్ని చాటుకున్న దేవాన్ష్ భవిష్యత్తులో మరెన్నో అద్భుత విజయాలను సాధిస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.