బ్రాహ్మణి పొలిటికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా..?
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అయితే సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి అలవాటే. ఎన్నో సంక్షోభాలను ఆ పార్టీ చూసింది. సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ ఆపార్టీ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అయితే గోడకు కొట్టిన బంతిలా ఆ పార్టీ మళ్లీ దూసుకొస్తోంది. ఇప్పుడు అధినేత చంద్రబాబు అరెస్టు కావడం.. జైలు పాలవడంతో ఆ పార్టీ పనైపోయిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆయన తర్వాత లోకేశ్ ఉన్నారని.. ఆయన కాకుంటే బాలకృష్ణ వస్తారని.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు చెప్పుకుంటున్నారు. అయితే వీళ్లందరి మీదా కాకుండా ఎక్కువ మంది దృష్టి బ్రాహ్మణిపై కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లిన తర్వాత భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి అక్కడే మకాం వేశారు. ఆ చుట్టు పక్కల జరుగుతున్న పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా.. దశాబ్దాలుగా వాళ్లది రాజకీయ కుటుంబమే అయినా ఏనాడూ భువనేశ్వరి పాలిటిక్స్ లోకి రాలేదు. పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. కానీ తొలిసారి చంద్రబాబు అరెస్టైన తర్వాత మీడియా ముందుకొచ్చారు. అయన నిర్దోషిగా బయటకు వస్తారని.. పార్టీకి తామున్నామని భరోసా ఇచ్చారు. ఇక నందమూరి, నారా కుటుంబానికి చెందిన బ్రాహ్మణి కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ట్వీట్లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి చంద్రబాబును అరెస్టు చేసిందనే ఆరోపణ చేస్తోంది టీడీపీ. ఇప్పుడు ఈ అరెస్టు చంద్రబాబుతో ఆగేలా కనిపించడం లేదు. ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాల్లో లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో ఉన్న లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అక్కడ మకాం వేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాదయాత్రను.. లోకేశ్ అరెస్టు భయంతోనే వాయిదా వేసుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఏపీలో ఉంటే అరెస్టు చేస్తారని భావించి లోకేశ్ ఢిల్లీ చెక్కేశాడని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే లోకేశ్ అరెస్టు కూడా ఖాయమనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ఒకవేళ లోకేశ్ కూడా అరెస్టు అయితే ఏం చేయాలనే దానిపై టీడీపీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. అయితే దీనికి చంద్రబాబు ఇప్పటికే అంతా సెట్ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ అరెస్టయితే పార్టీని లీడ్ చేసే బాధ్యతలను చేపట్టాల్సిందిగా చంద్రబాబు.. బ్రాహ్మణికి సూచించినట్లు సమాచారం. ఇందుకోసం పలు అంశాలపైన ఆమెకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాలు, తెలుగు భాష.. లాంటి అంశాలపై బ్రాహ్మణి ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోందట. అందుకే ఇటీవల భువనేశ్వరి మాత్రమే బయట కనిపిస్తున్నారు. సో.. త్వరలో బ్రాహ్మణి రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందన్నమాట.













