సకుటుంబ సపరివార ప్రచారం
ముఖ్య నేతలకు కుటుంబసభ్యుల చేదోడువాదోడు
ఎన్నికల సమయం సమీపించడంతో ప్రధాన రాజకీయ పక్షాల అగ్రనేతల కుటుంబ సభ్యులంతా తాము సైతం అన్నట్లుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో అగ్రనేతలకు కుటుంబ సభ్యులు చేదోడు వాదోడుగా ప్రచారం చేస్తున్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ఆయన కుమారుడు లోకేశ్ సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన భార్య బ్రాహ్మణి భర్తకు మద్దతుగా మంగళగిరిలో ఆదివారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా నందిగామలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నాటి ఎన్నికల ప్రచార సభలో ఆయన మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీహీరో బాలకృష్ణ తను పోటీ చేస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని తన భర్త, తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
పేదల ఆకలి తీర్చుతున్న అన్నక్యాంటీన్లు
నారా బ్రాహ్మణి
దుగ్గిరాల, న్యూస్‌టుడే: పసుపు-కుంకుమ ద్వారా మహిళల్ని, అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతుల్ని ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని నారా బ్రాహ్మణి అన్నారు. ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు, పెనుమూలి గ్రామాల్లో నారా లోకేశ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. పంచుమర్తి అనూరాధ, గంజి రాధ తదితరులతో కలిసి ఆమె మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ ద్వారా శుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందించి పేదల ఆకలి తీర్చిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేశ్, ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ మీ ముందు నిలిచారని..సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించాలని కోరారు. పసుపు-కుంకుమ, చంద్రన్న బీమా పథకాలను రానున్న ఐదేళ్లలో ఇంకా పెద్దఎత్తున అమలు చేస్తారని పేర్కొన్నారు. మంత్రిగా లోకేశ్ రాష్ట్రంలో 24 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయించారన్నారు. ఎల్ఈడీ బల్బులు ఇప్పటికే చాలా గ్రామాల్లో వచ్చేశాయని, జలధార పథకం అమలును ముమ్మరం చేస్తారని చెప్పారు. పెనుమూలిలో మహిళలు తమ గ్రామానికి ఆడపడుచు వచ్చిందంటూ దీపాలు వెలిగించారు. చర్చి వద్ద ప్రార్థనలు చేశారు. కంఠంరాజుకొండూరులో సామ్రాజ్యం అనే వృద్ధురాలు తనకు వస్తున్న పింఛనులో రూ.500ను బ్రాహ్మణికి అందించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.













