పాలిటిక్స్ లోకి నారా బ్రాహ్మణి..?
తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా ఆ పార్టీ లేని తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఊహించుకోలేం. నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీని ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కష్టకాలం వచ్చింది. దీంతో పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు నారా లోకేశ్ బాధ్యతలు చేపడతారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ బాధ్యతలను నారా బ్రాహ్మణి చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.
నారా బ్రాహ్మణి నందమూరి తారక రామారావు మనవరాలు. బాలకృష్ణ కుమార్తె.. అలాగే.. ఎన్టీఆర్ కుమార్తె వారసుడిని పెళ్లాడిన వనిత. ఇలా నందమూరి, నారా కుటుంబాలకు మధ్య వారధిగా ఉన్నారు నారా బ్రాహ్మణి. అందుకే బ్రాహ్మణి అయితే తెలుగుదేశం పార్టీని సమర్థంగా ముందుకు తీసుకెళ్లగలరనే డిమాండ్ ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాక.. నందమూరి, నారా కుటుంబాలని విడదీసి చూసే వాళ్లందరికీ కూడా సమాధానం ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు టీడీపీ నాయకులు. రాజకీయాలపై బ్రాహ్మణి ఇంతకాలం దృష్టి పెట్టలేదు. పుట్టినప్పటి నుంచి ఇంట్లో రాజకీయాలు చూస్తున్నా.. ఆమె ఎప్పుడూ అటువైపు మొగ్గు చూపలేదు.
బ్రాహ్మణి చంద్రబాబు కోడలు. లోకేశ్ భార్య. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. విద్యావంతురాలు. హెరిటేజ్ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా బ్రాహ్మణికి అవకాశం ఇస్తే తప్పకుండా తానేంటో నిరూపించుకోగలరని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత దాదాపు పది రోజుల నుంచి బ్రాహ్మణి రాజమండ్రిలోనే అత్త భువనేశ్వరితో కలిసి మకాం వేశారు. అక్కడ అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
రాజమండ్రిలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో బ్రాహ్మణి వైసీపీ సర్కార్ పై విరుచుకు పడ్డారు. తప్పకుండా తమకూ ఒక రోజు వస్తుందని.. ఆ రోజు తామేంటో నిరూపిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం అసమర్థ పాలనను ఎండగట్టారు. ఆరోజు బ్రాహ్మణి ప్రసంగానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత బ్రాహ్మణి చేసిన ట్వీట్ కూడా చర్చకు దారి తీసింది. సీమెన్స్ మాజీ ఎండీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని కోట్ చేస్తూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అనుమానాలను సీమెన్స్ మాజీ ఎండీ నివృత్తి చేశారని.. అయినా వాటిని అర్థం చేసుకోలేని అసమర్థులు వైసీపీ నేతలు.. అంటూ ట్వీట్ లో ఎండగట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి మాటలు బ్రాహ్మణి నోటి నుంచి రాలేదు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశం ఉందని టీడీపీలో కొంతమంది నేతలు చెప్తున్నారు. అది నిజమైతే బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం ఖరారైనట్లే.!













