Nara Brahmani: పొలిటకల్ ఎంట్రీపై నారా బ్రాహ్మణి సెన్సేషనల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసిన రెండు ప్రధాన కుటుంబాలు నారా – నందమూరి. ఈ రెండు కుటుంబాల కలయిక కేవలం వ్యక్తిగత బంధాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ గమనాన్ని నిర్దేశించే స్థాయికి ఎదిగింది. ఎన్టీఆర్ స్థాపించిన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కొనసాగిస్తుండగా, నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారు ప్రజా ప్రతినిధులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యువనేతగా నారా లోకేశ్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు కుటుంబాల వారసురాలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ పగ్గాలు చేపడతారని ఎప్పటి నుంచో బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ బ్రాహ్మణి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
నందమూరి తారకరామారావు మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా, చంద్రబాబునాయుడి కోడలిగా బ్రాహ్మణికి పుట్టుకతోనే రాజకీయ నేపధ్యం అబ్బింది. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితమైనా, ఇటీవల కాలంలో ఆమె శైలి మారింది. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, కుప్పం బాధ్యతలను పర్యవేక్షించడం వంటి పరిణామాలు చూస్తుంటే, నారా వారింట మహిళలు క్రియాశీల రాజకీయాల వైపు అడుగులేస్తున్నారన్న భావన కలిగింది. దీనికి తోడు 2019, 2024 ఎన్నికల సమయంలో బ్రాహ్మణి చేసిన ప్రచారం, ఆమె వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం చూసిన టీడీపీ శ్రేణులు.. ఆమెను ఎన్టీఆర్ అసలైన రాజకీయ వారసురాలిగా చూశారు. లోకేశ్ రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో, బ్రాహ్మణి కూడా తోడైతే పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.
అయితే, రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నింటినీ బ్రాహ్మణి ఒకే ఒక్క మాటతో ఖండించారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్ టుడే’ అవార్డుల కార్యక్రమంలో ఆమె ‘మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో ఇంటర్వ్యూయర్ అడిగిన సూటి ప్రశ్నకు ఆమె అంతే సూటిగా సమాధానమిచ్చారు. “మీ మామగారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని కోరితే, మీరు వెళ్తారా?” అన్న ప్రశ్నకు, బ్రాహ్మణి ఏమాత్రం తడుముకోకుండా “అబ్సల్యూట్లీ నాట్ (కచ్చితంగా రాను)” అని తేల్చిచెప్పారు. ఇది కేవలం ఒక సమాధానం మాత్రమే కాదు, తన కెరీర్ పట్ల ఆమెకున్న స్పష్టతకు నిదర్శనం.
రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారో కూడా బ్రాహ్మణి వివరించారు. హెరిటేజ్ ఫుడ్స్ అనేది కేవలం ఒక కంపెనీ కాదని, అది తన బిడ్డతో సమానమని (‘My Organization, My Child’) ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయగలమన్నది ఒక కోణమైతే, వ్యాపార రంగం ద్వారా కూడా సామాజిక మార్పు తీసుకురావచ్చని ఆమె బలంగా నమ్ముతున్నారు. హెరిటేజ్ సంస్థ ద్వారా లక్షలాది మంది రైతులకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని, వారి జీవితాల్లో వెలుగులు నింపడం తనకు రాజకీయ పదవులకంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. రైతులు, మహిళల సాధికారతకు హెరిటేజ్ ఒక వేదికగా మారిందని, ఆ బాధ్యతలను నిర్వర్తించడమే తన ప్రథమ ప్రాధాన్యతని ఆమె వెల్లడించారు.
బ్రాహ్మణి ప్రకటనతో టీడీపీ శ్రేణుల్లో ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. నారా కుటుంబంలో బాధ్యతల పంపకం చాలా స్పష్టంగా ఉందని దీనిని బట్టి అర్ధమవుతోంది. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ రంగాన్ని చూసుకుంటుండగా.. కుటుంబానికి ఆర్ధిక వెన్నుముకగా ఉన్న హెరిటేజ్ వ్యాపార సామ్రాజ్యాన్ని బ్రాహ్మణి సమర్థవంతంగా నడిపిస్తున్నారు. రాజకీయాల్లో రాణించడానికి కావాల్సిన ఇమేజ్, వాగ్ధాటి, కుటుంబ నేపథ్యం అన్నీ ఉన్నప్పటికీ.. తన అభిరుచికి తగ్గట్టుగా కార్పొరేట్ రంగాన్నే ఎంచుకుని, అందులో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ద్వారా బ్రాహ్మణి నేటితరం మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
మొత్తానికి, ‘రాజకీయాల్లోకి బ్రాహ్మణి రాక’ అనేది ఇక కేవలం గతం తాలూకు ఊహగానే మిగిలిపోనుంది. ఆమె ఎంచుకున్న మార్గం హెరిటేజ్, ఆమె లక్ష్యం బిజినెస్ ద్వారా సాధికారత అని తేలిపోయింది.






