నాకు జరిగిన అవమానం.. మరెవరికీ జరగకూడదు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన తెలిపిన వారందరికీ పేరుపేరుని ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లు భావించి అండగా నిలబడటం జీవితంలో మర్చిలేనని వ్యాఖ్యానించారు. చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు ఎంతో విలువలు, క్రమ శిక్షణతో పెంచారన్నారు. వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. తానే కాదు మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నేటికి మేం వాటిని పాటిస్తూన్నామని భువనేశ్వరి అన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతే తప్ప మహిళలను కించపరిచే విధంగా చట్టసభల్లో మాట్లాడడం సముచితంగా లేదన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.













