భువనేశ్వరి బస్సు యాత్ర ఖాయమా..?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కంటే కూడా కేసునే కొట్టేయాలనే క్వాష్ పిటిషన్ పైనే టీడీపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబు కోరుకుంటున్న క్వాష్ పిటిషన్ కానీ, బెయిల్ పిటిషన్ పై కానీ తీర్పు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయన మరికొన్నాళ్లు జైలులోనే ఉండక తప్పేలా లేదు. అందుకే ఇప్పుడు పార్టీ బాధ్యతలను భువనేశ్వరి, బ్రాహ్మణి భుజాలకెత్తుకున్నారు.
చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పటి నుంచి అక్కడే మకాం వేశారు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి. రాజమండ్రి కేంద్రంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ కూడా భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ లో చంద్రబాబును కలిశారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై జైలు నుంచే చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అక్టోబర్ 2న సత్యమేవజయతే పేరిట పార్టీ శ్రేణులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాయి. ఇలాంటి నిరసన కార్యక్రమాలను మున్ముందు మరింతగా చేపట్టేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది.
అయితే చంద్రబాబు బయటకు రావడం ఆలస్యమైతే భువనేశ్వరి మరింత యాక్టివ్ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. అయితే బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్.. తామున్నామంటూ తలోచేయి వేసి ధైర్యం చాటాయి. దీంతో పార్టీ నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే చంద్రబాబు అరెస్టును అనుకున్నంత స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయామని పార్టీ భావిస్తోంది. అందుకే భువనేశ్వరి, బ్రాహ్మణి సేవలను విస్తృతంగా వాడుకోవాలనుకుంటోంది. వాళ్లను జనంలోకి పంపడం ద్వారా పార్టీకి మేలు జరిగేలా చూడాలనుకుంటోంది.
చంద్రబాబుకు ఈ వారం రోజుల్లో ఊరట లభించకపోతే భువనేశ్వరి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కుప్పం నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ రెండు వారాలపాటు సాగేలా ఈ యాత్ర షెడ్యూల్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ వయసులో చంద్రబాబును అనవసరంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే విషయాన్ని జనంలోకి భువనేశ్వరి ద్వారా తీసుకెళ్లడమే మంచిదని టీడీపీ అనుకుంటోంది. అందుకే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే వారంలోనే భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













