సైకిల్ వ్యూహాలు
చంద్రబాబు అరెస్టై 40 రోజులు గడిచాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండిపోయారు. ఇక లోకేష్ పైనా కేసులు నమోదయ్యాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అధినేత ఎప్పుడు బయటకు వస్తారా అని శ్రేణులు ఎదురుచూడడంతోనే సమయం గడిచిపోతోంది. ఈదశలో ఓవైపు న్యాయపరమైన పోరాటంతో టీడీపీ శ్రేణులు కాలం గడిపేస్తున్నాయి. ఇంకేముంది టీడీపీ పనైపోయిందని వైసీపీ నేతలు కౌంటర్లు స్టార్ట్ చేశారు. ఇలాంటి సమయంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.
నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భువనేశ్వరికి రాజకీయాలు కొత్త కావడంతో.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు…చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
కేసుల నుంచి బయటపడిన తర్వాత భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనేలా ప్లాన్ చేశారు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత యధావిధిగా యువగళం కార్యక్రమానికి లోకేష్ హాజరు కానున్నారు. అంటే నెమ్మదిగా ఒక్కో కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు..పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సమాయత్తం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో మళ్లీ టీడీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుందని చెప్పొచ్చు.













