2024లో టీడీపీ, జనసేన అఖండ విజయం
2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ`జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ వాళ్లది ధన బలమైతే తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కమీషన్ కోసం కంపెనీలను బెదరగొట్టడం, కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు పెట్టడం, నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్న రాష్ట్రం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.













