చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి.. అన్నీ మంచిరోజులే : భువనేశ్వరి
నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువుదీరనున్న గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని తెలిపారు.
చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని, రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం, సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందుడుగు వేస్తుందని తేల్చి చెప్పారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నేరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.













