మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు : భువనేశ్వరి
తన తండ్రి, భర్త ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసినా, తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఆమెకు నిమ్మరసం ఇచ్చి చిన్నారులు దీక్షను విరమింపజేశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని చంద్రబాబును కోరేదాన్ని, ఎప్పుడూ ప్రజల బాగు కోసమే ఆయన పరితపించారు. నా ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలి. ప్రభుత్వ నిధులను మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ప్రజాధనంపై మాకు ఎప్పూడూ ఆశలేదు. మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదు. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఆనుకోలేదన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి ఆయన ఎంతో కష్టపడ్డారు. చంద్రబాబుపై నమ్మకంతోనే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ప్రజల కోసం రోజుకు 19 గంటలు కష్టపడేశారు. రోజుకు 3-4 గంటలే నిద్రపోయేవారు. చంద్రబాబు పదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేది. ఈసారి మీ ఓటును సరిగా వేయాలని కోరుతున్నా, చంద్రబాబు అరెస్టు చూసి మనస్తాపంతో 105 మంది మరణించారు. వీరి కుటుంబాలను త్వరలో పరామర్శిస్తా అని వెల్లడించారు.













