త్వరలో నంద్యాల నోటిఫికేషన్
నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో ఉప ఎన్నికను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సంసిద్ధులు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ప్రత్యేక ఓటరు నమోదు, నంద్యాల ఉపఎన్నికపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్లాల్ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జిల్లా అంతటా ఎన్నికల ఎన్నికల కోడ్ అమలులోకి రావాలని ఆదేశించారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందిని, నంద్యాల ప్రాంత ఉద్యోగులు మినహా, ఇతర ప్రాంతాల సిబ్బందిని గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ, ఓటర్ల జాబితపై క్షుణ్ణంగా చర్చించాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులపై పకడ్బందీగా నిఘా ఉంచాలని ఎస్పీకి సూచించారు. అలాగే తుపాకీల లైసెన్సుల మంజూరును నిలుపుదల చేయాలన్నారు.













