రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి
నల్గొండలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.
ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరారు.













