బాబు లేనప్పుడు బాలకృష్ణే నాయకుడా…?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఎన్టీఆర్ పార్టీ స్ధాపించిన తొలినాళ్లు మినహా ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఆ పార్టీలో కీలక నేతగా ఉంటున్నారు. ఎన్టీయార్ లేకపోతే పార్టీ ఏమైపోతుందో అని ఎంతోమంది అనుమానించారు. కానీ ఆ స్థానాన్ని చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు సమర్థంగా దాన్ని నడిపించగలుగుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో నెంబర్ టూ ఎవరనే ప్రస్తావనే అవసరం లేకుండా ప్రస్థావన సాగింది. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తొలిసారి జైలుకు వెళ్లారు.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో పార్టీని నడిపించే నాయకుడెవరు.. అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు జైలులో ఎన్నాళ్లు ఉంటారో తెలీదు. కానీ ఆయన లేని సమయంలో కూడా పార్టీని నడిపించాల్సి ఉంటుంది. లేకుంటే పార్టీలో మనోబలం దెబ్బతింటుంది. అలా లీడ్ చేయగలిగే వ్యక్తి ఇప్పుడు టీడీపీకి తక్షణావసరం. వాస్తవంగా చంద్రబాబు తర్వాత నారా లోకేశ్ ఆ బాధ్యతలు చేపడతారని అందరూ అనుకున్నారు. ఇన్నాళ్లూ చంద్రబాబు తర్వాత నెంబర్ టూ లోకేశేనని భావించారు. పార్టీ నేతలు కూడా ఆమేరకు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు నారా లోకేశ్ స్థానంలో బాలకృష్ణ ఎంటరయ్యారు.
తెలుగుదేశం పార్టీ నందమూరి ఫ్యామిలీది. నందమూరి తారక రామారావు స్థాపించిన ఆ పార్టీని చంద్రబాబు వెన్నుపోటి పొడిచి లాగేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆయన వెంటే నడవడంతో ఆ ఆరోపణలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే నందమూరి ఒరిజనల్ అభిమానులు మాత్రం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఎవరైనా పార్టీ బాధ్యతలు చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండగా పార్టీని నడిపించే బాధ్యతను బాలకృష్ణ తీసుకున్నారు. దీంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.
చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. లోకేశ్ కూడా అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను బాలకృష్ణ తీసుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అందుబాటులో ఉన్న నేతలతో తదుపరి కార్యాచరణపై చర్చించారు. సెంటర్ సీట్ లో బాలకృష్ణ కూర్చొని పరిస్థితిని సమీక్షించడం నేతలకు కొత్తగా అనిపించింది. చంద్రబాబు తర్వాత పార్టీ నారా లోకేశ్ చేతుల్లోకి పోకుండా బాలకృష్ణ లీడ్ చేయాలని ఇప్పటికీ చాలా మంది కోరుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత బాలకృష్ణకు కూడా పార్టీని లీడ్ చేస్ సత్తా ఉందని.. ఆయన తగిన నాయకుడని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు తర్వాత బాలకృష్ణ పార్టీ బాధ్యతలు చేపడితే నారా ఫ్యామిలీపై వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టినట్లవుతుంది.













