అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది : బాలకృష్ణ
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. మార్తాడులోని క్యాంప్ సైట్ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుమందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. గతంలో యువత కోసం టీడీపీ ఏం చేసిందో ఆయన చెబుతున్నారని, సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అన్నారు.
పరిశ్రమలు రాలేదు, ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందన్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వలసపోవాల్సి వస్తుందన్నారు. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు. టీడీపీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైసీపీ అరాచకాలను ఎదరించేందుకు ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది, అందరి సమస్యలు పరిష్కరిస్తుంది అని అన్నారు.













