నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినితి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ముందుగా గుజరాత్లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్, అధికారులే అమలు చేస్తారు. అజయే కల్లం ప్రతిపాదిస్తే ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తాం. నేనొస్తున్నా. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దాం అని అన్నారు.













