బాలయ్య హామీ.. బాబు రియాక్షన్ ఏమిటో..?
నందమూరి నట సింహం..హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి . సహజంగానే దూకుడుగా ముందుకు వెళ్లే బాలయ్య స్థానికంగా జరిపిన పర్యటనల నేపథ్యంలో తన నియోజకవర్గంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ళను పరిశీలించారు. ఆరు నెలల వ్యవధిలో నిలిచిపోయిన ఇల్లు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ కూడా ఇచ్చేశారు.
అంతేకాదు హిందూపురంలో అభివృద్ధికి కట్టుబడి ఉంటామని.. సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మార్పు చేయాలి అన్న డిమాండ్ పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేవలం ఈ డిమాండ్ హిందూపురానికి మాత్రమే పరిమితం కాదని.. రాష్ట్రంలో చాలాచోట్ల ఈ పరిస్థితి ఉందని.. అందుకే ఈ విషయంపై బాగా ఆలోచించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వం పుట్టపర్తి జిల్లాకు ఆధ్యాత్మికత పట్టణం అనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంగా మార్చింది. అయితే పుట్టపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లాలి అంటే స్థానికులు వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుంది. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిందూపురం టీడీపీ అడ్డా కావడంతో.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయకుండా.. వైసీపీ ఆ ప్రతిపాదన పక్కన పెట్టింది అన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలయ్య హ్యాట్రిక్ విజయం అనంతరం హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
అయితే బాలయ్య చెప్పినట్లుగా కేవలం ఈ సమస్య సత్య సాయి జిల్లాది ఒక్కటే కాదు.. పలుచోట్ల జిల్లా కేంద్రాలు మార్చాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలనే చెప్పాలి. ఒకసారి జిల్లా కేంద్రం అని ప్రకటించిన తర్వాత దాన్ని తీసేసి వేరే చోటుకు తరలిస్తామంటే అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. జిల్లాల పునర్విభజన అనేది ప్రస్తుతం ప్రభుత్వానికి కత్తి మీద స్వాములా ఉంది. దీంతో జిల్లా కేంద్రం మార్పిడి గురించి మాట్లాడి బాలయ్య తేనె తుట్టెను కదిపారు అని అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ డిమాండ్లకు ఎలా స్పందిస్తుంది అన్న విషయం చూడాలి.













