Nallapareddy: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టు ఖాయమా?

నెల్లూరు జిల్లాలోని కోవూరు (Kovur) నియోజకవర్గం రాజకీయ వివాదంతో ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy), ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై (Vemireddy Prasanthi Reddy) అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైనప్పటికీ, అతనిని ఇంకా అరెస్టు చేయకపోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిపై (YS Bharathi Reddy) టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఘటనతో దీన్ని పోల్చుతున్నారు. ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఇవి మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తర్వాత, ప్రశాంతి రెడ్డి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు.
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఈ వ్యాఖ్యలను “జుగుప్సాకరం” అని వర్ణించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) “ఇలాంటి వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటు” అని పేర్కొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు, ప్రసన్నకుమార్‌ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణులు, మహిళా నాయకులు ప్రసన్నకుమార్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.
గతంలో వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో 24 గంటల్లోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ సమయంలో ఖుష్బూ, రాధిక, మీనా, రమ్యకృష్ణ వంటి సినీ తారలు వీడియోల ద్వారా భారతీ రెడ్డిపై చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే, ఇప్పుడు అలాంటి వాళ్లంతా నోరు మెదకపోవడాన్ని కూడా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రశాంతి రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలను ఎందుకు ఖండించట్లేదని నిలదీస్తున్నాయి.
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు, నెల్లూరులోని సావిత్రి నగర్‌లో ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫర్నిచర్, కార్లు ధ్వంసం చేయబడ్డాయి. వైసీపీ నాయకులు ఈ దాడిని హత్యాయత్నంగా అభివర్ణించారు. పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి వెనుక టీడీపీ ఉందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైనప్పటికీ, అతని అరెస్టుపై స్పష్టత లేదు. మహిళా కమిషన్, టీడీపీ నాయకుల ఒత్తిడితో అరెస్టు ఖాయమనే సంకేతాలు ఉన్నాయు. అయితే, పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇది టీడీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అని టీడీపీ కార్యకర్తలే ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో భారతీ రెడ్డి ఘటనలో వేగంగా చర్యలు తీసుకున్నారని, ఇప్పుడెందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి సమస్యగా మారింది.
ఈ వివాదం కోవూరు రాజకీయాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ మాత్రం ఈ ఘటనను రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరిస్తోంది. అరెస్టు జరుగుతుందా లేదా అనేది పోలీసుల తదుపరి చర్యలపై ఆధారపడి ఉంది.