Nallapareddy Prasanna Kumar Reddy: విచారణ తర్వాత కూడా మాట తీరు మార్చని ప్రసన్నకుమార్ రెడ్డి..

వైసీపీ (YCP) నేత, కోవూరు (Kovur) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) ను శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమై రెండు గంటల పాటు సాగింది. ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు.
అయితే, విచారణ అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా విడుదల చేశారు. కారణంగా, సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులోని మార్గదర్శకాలను పేర్కొన్నారు. 41A ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం తప్ప, తక్షణ అరెస్ట్ కు వీలులేదని అధికారులు వెల్లడించారు.
విచారణలో ప్రసన్నకు సుమారు 40 ప్రశ్నలు వేశారు. వాటికి ఆయన కొన్ని విషయాలను రాతపూర్వకంగా సమాధానంగా ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ప్రసన్న తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. గతంలో చెప్పిన అభిప్రాయాలే తిరిగి వ్యక్తం చేశానని పేర్కొన్నారు. కొందరు తనపై మహిళలను గౌరవించరన్న అభిప్రాయాలు వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి మాటల్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు.
ఇక గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రసాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె, ప్రసన్న కుటుంబాల్లో గతంలో సంబంధాలు ఉన్నప్పటికీ, రాజకీయాల్లో వారు ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల సమయంలో ప్రసన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. మరోపక్క ఎన్నికల తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా పర్సంటేజ్ ప్రసన్న అంటూ అతనిపై పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తరచూ సంభవిస్తూ ఉంది.
అయితే కొద్దికాలం క్రితం ప్రసన్న ప్రశాంతి రెడ్డి పై చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు టీడీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ (TDP) వర్గాలు ప్రతిగా స్పందించాయి. కొంతమంది కార్యకర్తలు ప్రసన్న నివాసంపై దాడికి పాల్పడి వస్తువులను ధ్వంసం చేశారు. తర్వాత కోర్టు జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది మొదటి దశ విచారణ మాత్రమేనని, అవసరమైతే మరలా పిలవవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. ఈ పరిణామాలు నెల్లూరు ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.