ఆ ఘనత సీఎం వైఎస్ జగన్‌కే : నాగబాబు
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని జనసేన నాయకులు నాగబాబు అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు మాట్లాడారు. రాజధాని అమరావతి ఉండాలని రైతులు ఆకుంఠిత దీక్షతో పోరాటం చేశారని, కోర్టు తీర్పును జగన్ శిరసా వహించాలని సూచించారు. రాజధానిపై కోర్టులకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. లేదంటే ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత వహించిన వారవుతారని తెలిపారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే సగానికి పైగా ప్రజలు కాందశీకుల్లా పక్క రాష్ట్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు.
జగన్ పాలనలో సీఎం, ఆయన సలహాదారులు తప్ప ఎవరైనా బాగున్నారా? అని ప్రశ్నించారు. మంత్రులు సైతం అసహనంగా ఉన్నారని తెలిపారు. చేయడానికి పనిలేక కొందరు మంత్రులు ఫోన్లలో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనకు సోదరుడే అయినప్పటికీ పార్టీ పరంగా పవనే తన నాయకుడని తెలిపారు. పవన్ ఆశయాల కోసం ఓ జనసైనికుడిగా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.













